"వ్యవస్థ" లో జరిగేది నిజమేనా ?

మీ అందరికీ ఒక విజ్ఞప్తి: మీకు జీవితంలో ఎలాంటి సమస్య వచ్చినా దయచేసి న్యాయస్థానానికి మాత్రం వెళ్ళకండి. దేవుడి మీద భారం వేసి సామరస్యంగా తేల్చుకోండి. ఎందుకు? 

ఈ వెబ్ సిరీస్ చూశాక నాకున్న అనుభవం కూడా జోడించి చెప్తున్నాను. ఏదో మనని ఉద్ధరిస్తారని న్యాయస్థానానికి వెళ్తే అక్కడ లాయర్లు తెచ్చిపెట్టే ఇబ్బందులు మన సమస్యల కన్నా పెద్దవిగా అనిపించి చిక్కుకుపోతాము. ఒక్కసారి వాళ్ళని నమ్మి మన జీవితం వాళ్ళ చేతిలో పెడితే, ఆ వలయం నుంచి బయటకు రావడానికి కొన్ని ఏళ్లు గడుస్తాయి, మన ఆరోగ్యం నశిస్తుంది, ఒంట్లో చీము నెత్తురు ఇంకిపోతాయి. ఏంటి భయపెడుతున్నాను అనుకుంటున్నారా? చాలా వరకు జరిగేది అదేనండి. అలా అని మీరు అధైర్య పడకండి, చివరిలో గెలిచేది న్యాయమే కానీ గెలిచేదంతా న్యాయం కాదు. అర్థమయ్యేటట్టు చెప్తాను చదవండి.


ముందుగా వెబ్ సిరీస్ గురించి మాట్లాడుకుందాం. దీని పేరు: "వ్యవస్థ". వ్యవస్థ అంటే ముఖ్యంగా న్యాయవ్యవస్థ గురించి తీశారు. హెబ్బా పటేల్ ఇందులో "యామిని" పాత్ర పోషించింది. మరో ముఖ్య పాత్ర "వంశి". లాయర్ బడా సాబ్ లాగా "చక్రబోర్తి" పాత్రలో సంపత్ కుమార్ గారు నటించారు. ఆయన భార్య, "గాయత్రి"గా కామ్నా జట్మలాని నటించింది. సరే ముందుగా యామిని పెళ్లి అవుతుంది. యామిని తల్లి తన పెళ్లిని చాలా ఘనంగా చేస్తుంది. యామినికి తండ్రి ఉండడు. మొదటి రాత్రి అప్పుడు కొన్ని తుపాకీ పేలుళ్ల శబ్దంలో యామిని భర్త మరణిస్తాడు. ఇంట్లో పని వాళ్లు వచ్చి చూసేసరికి యామినీ చేతిలో రివాల్వర్ తో  కనిపిస్తుంది. యామినిని పోలీసులు విచారణకు తీసుకెళ్తారు. యామిని వైపు డిఫెన్స్ మన "చక్రబోర్తి" (అవును, బెంగాలీ). తీరా కోర్టుకి వెళ్లిన తర్వాత "ఈ కేస్ ని డిఫెండ్ చేసుకోవడానికి మేము సిద్ధంగా లేము", అంటుంది యామిని. తన లాయరు తనని సేవ్ చేయడు ఫ్రేమ్ చేస్తున్నాడు అని తెలిసి జడ్జిని ఇంకాస్త సమయం అడుగుతుంది. ఇక్కడ మనం లాయర్ చక్రబోర్తి గురించి మాట్లాడుకోవాలి. డబ్బు ఇస్తే ఎవరినైనా దోషిగా ఎవరినైనా నిర్దోషిగా చూపెట్టేసి కేసు గెలిచేయగలడు. తలలు మార్చి, సొసైటీలో మంచి హోదా, పేరు ప్రతిష్టలతో కొనసాగుతూ, ఇంకా సొసైటీలో స్టేటస్ ఎలా పెంచుకోవాలి అని కలలుగనే మోడరన్ లాయర్. అన్ని హై ప్రొఫైల్ కేసులు మాత్రమే వాదిస్తాడు. అతని తండ్రి ఒకప్పుడు న్యాయబద్ధంగా పోరాడిన లాయర్. ఆ తండ్రి పేరు చెప్పుకొని అక్కడున్న లాయర్లందర్నీ తన వైపు తిప్పేసుకుని, ఒక హై క్లాస్ క్లబ్ ఏర్పాటు చేసి, ఏ కేసు వచ్చినా తన క్లబ్ వాళ్ళే వాదించేలాగా చేసుకుంటూ, అవతల వైపు లాయర్లని ఏదో పేరుకు మాత్రమే పెట్టి, వాళ్లని కూడా కొనేసి తనే విజయాలు సాధించేస్తూ ఉంటాడు. సొసైటీలో హైక్లాస్ ఫ్యామిలీస్ తో కలిసి తన భార్య గాయత్రీని కూడా ఎరవేస్తూ సొసైటీలో ఇంకాస్త పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఏ క్లైంట్ అయినా తన మాట వింటే బయట తిరుగుతాడు లేదంటే జైలుకి పంపించగలడు. కోర్ట్ లో గుమాస్తాల నుంచి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ వరకు అందరూ తన గుప్పెట్లో కీలుబొమ్మలే. చక్రవర్తి నడిపే విషవలయం, అదే, లాయర్ క్లబ్ పేరు " చెక్ మేట్".

సరే, ఇంతకీ యామిని చక్రబోర్తీని లాయర్ గా పెట్టుకున్న తర్వాత జడ్జి దగ్గర మాత్రం ఇతను ఫ్రేమ్ చేస్తున్నాడు అని ఎలా తెలుసుకోగలిగింది? ఇందాక మనం చెప్పుకున్నామే వంశీ పాత్ర, ఆ వంశీ యామినికి ఒక వీడియో క్లిప్పింగ్ పంపిస్తాడు చక్రబోర్తి ని నమ్మద్దని. వంశి నిజానికి చక్రబోర్తీ కంపెనీలోనే ఇరుక్కుపోయిన ఒక జూనియర్ లాయర్. కానీ యామిని మీద కొంచెం లవ్ ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తి. ఎప్పటినుంచో యామిని అంటే పరిచయం ఉంది, కానీ వన్ సైడ్ లవ్ కాబట్టి యామినికి వంశీ గురించి పెద్దగా తెలియదు. మరి జడ్జి దగ్గర సమయం అడిగిన యామినికి ఇప్పుడు మరొక లాయర్ ఎక్కడ దొరుకుతాడు? అందరు లాయర్లు చక్రబోర్తి కంపెనీతో సంబంధాలు ఉన్నవాళ్లే. అడపాదడపా ఒకళ్ళో ఇద్దరూ తప్ప. "నాకు వీడియో పంపావు నువ్వే నా కేసు తీసుకోవచ్చు కదా", అని అడుగుతుంది యామిని. వంశి వాళ్ళ నాన్న కూడా చక్రబోర్తి కంపెనీలో పని చేసినవాడే. నిజానికి, వంశీ లా చదువుకి కూడా చక్రబోర్తినే డబ్బు సాయం చేశాడు. వంశి చక్రబోర్తికి ఎదురుగా నిలబడి పోరాడగలడా? గెలవగలడా? యామినీని కేసు నుంచి తప్పించగలడా? అసలు ఆ హత్య చేసింది ఎవరు? పైగా అతనికి నత్తి సమస్య కూడా ఉంది.

చక్రబోర్తి ఏమన్నా సామాన్యుడా? వంశీ కేసు తీసుకున్న మొదటి వాయదాకే, "వంశీకి యామినికి ఇంతకుముందే పరిచయం ఉన్నట్లు సాక్షాలు తీసుకొచ్చి ఇద్దరూ కలిసే యామిని భర్తను హత్య చేశారు, వీళ్ళిద్దరినీ కలిపి విచారించాలి" అని జైల్లోకి నెట్టేస్తాడు. ఇక జైలులో జైలు సిబ్బందిలో కొంతమంది కూడా చక్రబోర్తికి తెలిసినవారే. ఒకవైపు వంశీని మరోవైపు యామినీని హింస పెడుతూ ఉంటారు. అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ మాత్రం కొద్దిగా నీతి ఉన్నవాడు. అతనికి మన వంశీ తన కథ చెప్తాడు. యామిని వెంటపడింది తానేనని యామినీ లా కాలేజ్ లో చేరిందని తను కూడా లా తీసుకున్నాడని, కానీ యామినికి లా ఇంట్రెస్ట్ లేక రెండు రోజులకే ఫ్యాషన్ డిజైనింగ్ తీసుకొని వెళ్ళిపోయిందని తను మాత్రం అక్కడ కాత్యాయని అనే ప్రొఫెసర్ వల్ల లా కొనసాగించాడని చెప్తాడు. ఆవిడే చక్రవర్తి లాంటి లాయర్లు కోర్ట్లల్లో ఎలా న్యాయాన్ని అమ్మేస్తున్నారు చెప్తుంది. " అందరూ లా చదువుకొని కోర్టుకు వెళ్తారు నేను మాత్రం అక్కడ అన్యాయం చూస్తూ ఉండలేక కోర్టు నుంచి మళ్లీ కాలేజీకి వచ్చి మీకు పాఠాలు చెప్తున్నాను, కనీసం నేను పాఠాలు నేర్పించే వాళ్లలో కొంతమందినైనా నాలాగా ఆదర్శవంతంగా తయారు చేయగలుగుతానేమోనని" నమ్మే వ్యక్తి ఆవిడ. అదే కాలేజీలో చక్రబోర్తి కూతురు చదువుతున్నా ఆ అమ్మాయి చేసే అన్యాయాన్ని ఎదిరిస్తుంది కాత్యాయని మేడం. ఆవిడని చూసి ఎప్పటికైనా చక్రబోర్తికి ఎదురు వెళ్ళాలి అన్నదే వంశీ లక్ష్యం. కానీ తను డబ్బు ఇస్తే చదువుకున్నవాడు తనకి అడ్డు వస్తూ ఉంటే చక్రవర్తి చూస్తూ ఊరుకుంటాడా?

యామిని మామగారు యామిని అమ్మని బెదిరిస్తాడు. అదే యామిని మామగారినీ క్లైంట్ గా పెట్టుకున్న మన చక్రబోర్తి, యామిని తల్లిని పిలిపించి, "యామిని చేత మీరు వంశీనే హత్య చేశాడు అని వాంగ్మూలం ఇప్పించండి యామినిని బయటకి తీసుకొచ్చేస్తాను" అంటాడు. తన తల్లి తనని ఒప్పించే ప్రయత్నం చేసినా తనకోసం నిలబడిన వంశీనీ అలా అన్యాయంగా ఇరికించకూడదని యామిని ఒప్పుకోదు. ఈ కేసు వంశీ ఫ్రెండ్ ఇంకొకతను తీసుకుందామనుకున్నా అతన్నీ బెదిరించి ఊరు నుంచి తరిమేస్తారు. హద్దు మీరుతున్న అన్యాయాన్ని చూసి చక్రబోర్తి మేనమామ "అప్పారావు గారు" జైల్లో వంశీకి రక్షణ లేదని ముందు అతన్ని బయటకి తీసుకువస్తాడు. ఆయన కూడా లాయరే కానీ చక్రబోర్తి కి భయపడి కేసులు ఎప్పుడూ వాదించలేదు. బయటకి వచ్చిన వంశీ ఆధారాలు సేకరిస్తూ ఉంటాడు. మొత్తానికి అప్పారావు గారిని ప్రిపేర్ చేసి యామినీ కేసు తీసుకునేలా చేసి, తను వెనకే ఉంటూ కేసును ముందుకి నడిపిస్తూ ఉంటాడు వంశీ. నిజానికి యామిని ఇల్లు పురాతన కాలం నాటి కట్టడం. అందులో మూడో మనిషి చొరబడే అవకాశం ఉంది. కచ్చితంగా హత్య మూడో మనిషి చేశారు. అయినా కూడా యామిని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు అని ప్రూవ్ చేస్తారు. చక్రబోర్తి పైన విజయం సాధిస్తారు. అయితే చక్రబర్తికి అర్థమైన నీతి ఏమిటంటే, "యామిని భర్తది ఆత్మహత్య కాదు ఎవరో చంపారు అనేది నిజం. కానీ యామినీ ని కాపాడడం కోసం వంశీ కూడా వ్యవస్థలోకి వచ్చే అబద్దాన్ని ప్రూవ్ చేశాడు, అంటే వంశీ కూడా వ్యవస్థలో భాగం అయినట్టే కదా! నా ఈగో వల్లనే నా మీద గెలిచిన ఇంకో అడ్వకేట్ ని తయారు చేశాను" అని తెలుసుకుంటాడు. అలా అప్పటినుండి వంశీ చక్రవర్తి తీసుకున్న కేసులకి అపోనెంట్ లాయర్ గా వాదిస్తూ ఉన్నట్టు చూపిస్తారు. ఇంతకీ హత్య ఎవరు చేశారో మీరు వెబ్ సిరీస్ చూసి తెలుసుకోండి.

అయితే, నిజానికి బయట కూడా పరిస్థితి ఇలాగే ఉందండి. కాత్యాయిని మేడం లాంటి వాళ్ళు ఉన్నా నిలదొక్కుకోలేక కాలేజీ లో ప్రొఫెసర్లు అవుతున్నారు. చక్రబోర్తి అన్నట్టు వంశి కూడా నిజాన్ని దాచాడు మరి నిజం గెలిచిందా? న్యాయం గెలిచిందా? అంటే వంశి హీరోయిన్ ని కాపాడాడు, కాబట్టి పోనీలే హీరోయిన్ ని ఇబ్బంది పెట్టినందుకు చక్రబోర్తి ఓడిపోయాడు అని సరిపెట్టుకోవాలా ? అంతే! చక్రబోర్తి తో పోలిస్తే వంశి కేవలం నిజాన్ని దాచాడు, అన్యాయాలు అక్రమాలు చెయ్యలేదు. బైట చాలా వరకు మనకి కనిపించేది "చక్రబోర్తి" లాంటి వాళ్ళే. ఉదాహరణకి నేను ఒకరి మీద కేసు వెయ్యాలి అనుకుంటున్నాను అనుకోండి. నేను ఒక లాయర్ ని పెట్టుకుంటాను. కానీ ఏ కేసులైనా సిటీ సెంటర్లో పెద్ద ఆఫీస్ పెట్టుకున్న ఆ హై క్లాస్ బడా లాయర్ చేతిల మీదగానే అన్ని కేసులు డీల్ అవుతూ ఉంటాయి. ఆ విషయం తెలుసుకునేసరికి నా జీవితకాలంలో కొన్ని ఏళ్లు గడిచిపోతాయి. ఈ లోపల ఎంతోమంది జడ్జిలు మారిపోతారు. ఎన్నో ఎన్నో వాయిదాలు పడిపోతాయి. నేను పెట్టుకున్న లాయరు ఇదిగో అదిగో అంటాడు కనీసం కేసుకి కౌంటర్ ఫైల్ కూడా ప్రిపేర్ చేయడు, వాయిదాకి రాడు. నేను చేసిచ్చిన కౌంటర్ ఫైల్ ని కనీసం కోర్టులో సబ్మిట్ చేయడు. ఒక్కోసారి మనం ఇచ్చిన ఫైల్స్, ఎవిడెన్స్ లు కూడా మాయం అయిపోతూ ఉంటాయి. అప్పటికి మనకి విషయం అర్థమవుతుంది మన లాయరు అమ్ముడుపోయాడు అని. గత్యంతరం లేక బడా లాయర్ దగ్గరికి వెళ్తాము. అప్పటికే నేను ఎవరి మీద కేసు వేశానో ఆ ఆపోజిట్ పార్టీ ని క్లైంట్ గా చేసేసుకుంటాడు ఈ బడా లాయర్. నాకు మంచి సలహాలిస్తూ నా ఫీజు, అవతల వాళ్ళని ఉద్ధరిస్తున్నందుకు వాళ్ల నుంచి ఫీజు దొబ్బుతాడు. చివరాఖరికి మనకి అర్థమైయ్యే నీతి ఏమిటంటే ఇక్కడ డబ్బులు ఇచ్చి, జీవితకాలంలో కొన్ని ఏళ్ళు కోర్టు చుట్టూ తిరిగి నేను, నేను ఎవరి మీద కేసు వేశానో వాళ్లు, విసికి విసికి, అలసి సొలసి ఇక ఈ లాయర్లకి ఫీజు ఇవ్వటం వృధా అని మాకు మేమే ఒక ఒప్పందానికి వచ్చేస్తాం అనమాట! మధ్యలో లాభ పడినది ఎవరు? ఆ బడా లోయరే కదా! అందుకే చెప్పాను, "ఇందులో న్యాయం ఉండదు, ఓపిక నశించిన తర్వాత ఏమి గెలిచినా గెలిచినట్టే అనిపిస్తుంది. గెలిచిందే న్యాయం అనుకుంటాము. అందుకనే అన్నదమ్ముల సమస్య అయినా, భార్యాభర్తల సమస్యలైనా, మనం పని చేసే వాళ్ళ పైన మనం కేసులు వెయ్యాలనుకున్నా, ఆస్తుల కోసమైనా, మనకి మనమే పరిష్కరించుకుంటే మేలు. లేకపోతే ఒక కోతి వచ్చి రొట్టెముక్క తానే మొత్తం తినేసి పిల్లులకు ఏమి మిగల్చనట్టు ఉంటుంది పరిస్థితి.


 "అంటే కోర్ట్ లో అస్సలు న్యాయం జరగట్లేదా?" అని మీరు అడిగితే నేను ఒకటి చెప్పగలను. నాకు తెలిసిన ఒక అతను తన భార్య మీద కేసు వేశాడు. భార్య వేధింపులు గురించి చెప్తూ చెప్తూ ఆఖరికి లాయర్ వేధింపులకు బలైపోయాడు. కానీ ధైర్యంగా నిలబడి తన కేసుని తానే వాదించుకోవాలని వాయిదాల మధ్యలో ఐఐటీ ఖరగ్‌పూర్లో లా కోర్సులో రిజిస్టర్ అయి ఇప్పుడు తన కేసు తనే వాదించుకుంటున్నాడు. ఇలా ఓపిక ఉన్న వాళ్ళు, ఎన్నేళ్లయినా ఏమి జరిగినా నేను గట్టిగా నిలబడతాను అనుకున్నవాళ్లు మాత్రమే కోర్టు జోలికి వెళ్తే మంచిది. మంచి నీతివంతమైన లాయర్లు కవిడ్ కి బాలి అవ్వటం కూడా చూసాను. ఒక లాయర్ నాకు చెప్పాడు "One's loss is one's gain" అని.


Comments